𝖆𝖓𝖆𝖓𝖉.𝖇


Aksharalu

by Rajyalakshmi Somayajula

అక్షరాల వెంట
కన్నీళ్లు ఎందుకు పరుగెడుతున్నాయో
తెలియడంలేదు!

నిండు ఆకాశమంత భారం
గుప్పెడంత గుండెలో ఎలా చేరిందో
తెలియడంలేదు!

ఆ కళ్లలోని ఆవేదన
అనుక్షణం ఎందుకు తరుముతోందో
తెలియడంలేదు!

నిన్నటికి రేపటికి నడుమ
నేటిగా ఈ పయనం ఏమవుతుందో తెలియడంలేదు!

పరుగెత్తి అలసిన ముసలితనం
పడుతూ లేస్తూ సాగే చిన్నతనం
ముందు వెనుకల గమనం ఎలా ఉంటుందో తెలియడంలేదు!

ఒక నవ్వు ఒక పలకరింపు
బాధ్యత తీరిపోతుందా
బంధానికి అర్థంగా సరిపోతుందా
తెలియడంలేదు!

కనిపెంచిన పుణ్యానికి
కంటికిరెప్పలా కాచుకునే ప్రతిఫలం
ఆశా లేక ఆశించేదా
తెలియడంలేదు!

లోకాన్ని చూపించిన చూపుకి
చివరి చూపు వరకు నేనుంటాను
అనే నమ్మకాన్ని ఎలా చూపించాలి తెలియడంలేదు!

వేలుపట్టి అడుగులు నేర్పిన
ఆ అడుగులే తడబడుతుంటే
చేతికర్రగా మారి సాయం అందించేదెలా
తెలియడంలేదు!

బంధాలను భద్రంగా
బాధ్యతలను భారం కాకుండా
చూసుకునే రోజు ప్రతిరోజూ అవుతుందా
తెలియడంలేదు!

అన్నీ ప్రశ్నలే,
సమాధానాలు చూపే దారి
ఎటువైపుందో
అస్సలు తెలియడంలేదు!!